Followers

Wednesday 22 July 2020

"సుడి"గుండం

సాంబయ్య కష్టపడి కూతురుని డిగ్రీ దాకా చదివించాడు. ఆ డిగ్రీ ద్వారా నె ఊళ్లో చిన్న ఉద్యోగం సంపాదించింది లక్ష్మి. తల్లి లేని పిల్ల కి అన్ని తానె అయి చూసుకున్నాడు. ఇంక పెళ్ళి ఒక్కటి చేస్తే తన బాధ్యత తీరిపోతుంది. లక్ష్మి ని చూసి, పెళ్ళి చేసుకోడానికి ఇష్టపడతాడు మేనేజర్. లక్ష్మి కూడా నచ్చడం తో సాంబయ్య కూడా సరే అన్నాడు. మేనేజర్ తండ్రికి జాతకాల పిచ్చి. లక్ష్మి జాతాకం తన కొడుకు జాతాకం తో పక్కాగా కుదరడం తో ఆయన అడ్డు చెప్పలేదు. కాకపోతే మే నెల లో పెట్టిన ముహూర్తానికి పెళ్ళి జరిపించాల్సినదే అని పట్టు పట్టాడు. సాంబయ్య బాధ అల్లా, ప్రపంచం ఎంత ముందుకు పరిగెడుతున్నా, ఎన్ని సరికొత్త ఆవిష్కరణాలు జరిగినా, ఆడ పిల్ల పెళ్ళి చెయ్యాలంటే కట్నం ఇచ్చుకోవలసినదే. పరువు పేరు తోనొ, పరపతి సాకుగానో, ఆచారం మాటుగానో ఇంకా కట్నం నక్కి ఉంది. సాంబయ్య పరిస్థితి అర్ధం చేసుకున్న మేనేజర్ తండ్రి, కట్నం కుదరక పొతే కనీసం ఘనంగా పెళ్ళి జరిపించమన్నాడు. సాంబయ్య దగ్గర ఉన్న డబ్బు తో ఒక 20 మందికి భోజనం పెట్టి గుళ్లో పెళ్ళి చేయించగలడు. ఏమి చెయ్యాలో అర్ధం అవ్వటంలేదు సాంబయ్య కి. 

అక్బర్ ఒకప్పుడు చేతి నిండా పని ఉన్న టైలర్. పండుగలప్పుడు, షాప్ లో పగలు రాత్రి పని చేసినా ఖాళీ ఉండేది కాదు. రెడీమెడ్ బట్టలు పెరిగాక అక్బర్ కి పని లేకుండా పోయింది, షాప్ కూడా వదిలేసాడు. బయట అప్పులు ఎక్కువ అయిపోయాయి, ఇల్లు తాకట్టు పెట్టాడు. బిగ్ బజార్ లో ఆల్టరింగ్ చేసే టైలర్ గా చేరాడు. కొన్నాళ్లు బానే నడిచింది, మెల్ల మెల్లగా అప్పులు తీర్చుతున్నాడు. ఇంకొంచెం డబ్బులు వస్తే అప్పులు అన్ని తిరిపోతాయి, ఇల్లు విడిపించు కోవచ్చు అనుకున్నాడు. కాని ఇప్పుడూ ఈ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పెరిగాక బిగ్ బజార్ కి జనాలు తగ్గిపోయారు, పెద్దగా పని కూడా లేకుండా పోయింది, డబ్బులు రావడము ఆగిపోయింది. ఎక్కడా పని దొరకటం లేదు. క్లాత్ తెచ్చి కుట్టమని అడిగే నాధుడే లేకుండా పోయాడు. డబ్బులు ఎలా సంపాదించాలో తెలీయటలేదు. 

ప్రకాశ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెలివి గలవాడు, కష్టపడి పని చేసే మనస్తత్వం. కాకపోతే మోహమాటం ఎక్కువ. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనలేడు. అలాగే తనకి ఏదైనా కావాలన్న ఖచ్చితం గా అడగలేడు. ప్రకాశ్ వాళ్ల బాస్ పరమ నీచుడు. ప్రకాశ్ తో మిగతా వాళ్ల పనులు కూడా చేయించేవాడు. ప్రకాశ్ రోజు రాత్రి దాకా పని చేస్తుంటే బాస్ మిగతా వారు కలిసి ఆఫీస్ నుంచి త్వరగా చెక్కేసి పార్టీ లు చేసుకునే వాళ్ళు. ఆఖరికి ఒక్కోసారి శని, ఆది వారాలు కూడా వెళ్ళాల్సి వచ్చేది. ప్రకాశ్ కి 6 నెలల క్రితం కూతురు పుట్టింది. డెలివరి అప్పుడు 10 రోజులు సెలవు ఇచ్చాడు వాళ్ల బాస్, ఊరు వెళ్లి భార్య పిల్ల దగ్గర ఉండడానికీ, అంతే. మళ్లీ ఎప్పుడు సెలవు అడిగినా ఎదో ఒక సాకు తో కుదరదు అనేవాడు. ప్రకాశ్ కి ఊరు వెళ్లి కూతురు ని చూడాలని ఉండేది, కుదరటం లేదు. 

రవి కి చిన్నప్పటి నుంచి చదువు అబ్బ లేదు. ఎప్పుడు క్లాసు లో లాస్ట్ వచ్చేవాడు ఒక్క లెక్కలలో తప్ప. అన్ని సబ్జెక్టులు పోయిన, లెక్కలు లో మాత్రం మంచి మార్కులు వచ్చేవి. కాని అన్ని సబ్జెక్టులు పాసు ఆయితే నే తరువాతి క్లాసు కి పంపిస్తారు. ప్రతిసంవత్సరం పరీక్షల ఫలితాలు రాగానే, రవి వాళ్ల నాన్న టీచర్ల ని బతిమాలి తరువాతి క్లాసు కి తెప్పించెవాడు. ఫలితాలు వచ్చిన రోజు రవి కి వాళ్ల నాన్న చేతిలో బడిత పూజ జరిగేది. ఈ సంవత్సరం రవి పదవ తరగతి. వాళ్ల నాన్న రవి ని కూర్చోబెట్టి చెప్తాడు "నువ్వు ఇంక పై చదువులు చదవ లేవు అని నాకు అర్దం అయింది. కాని కనీసం పదవ తరుగతి కూడా పాస్ అవకపోతే ఎవడు ఉద్యోగం ఇవ్వడు. నీకు లెక్కలు ఎలాగు బాగా వచ్చు కాబట్టి పది పాస్ ఆయితే మా కంపెనీ లో ఎకౌంటు డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వేయించ వచ్చు. ఏలాగోలా కష్టపడి ఈసారి పాస్ అవ్వరా. ఇన్నాళ్ల లా  టీచర్ల ని బతిమాలితె పాస్ అవ్వవు". సంవత్సరం పూర్తి అయిపోతుంది. రవి చదువు లో యే మార్పు లేదు. స్కూల్ లో పెట్టిన అన్ని పరీక్షలు పోయాయి. ఆఖరి పరీక్షల సమయం వచేసింది. రవి కి భయం తో చమటలు పడుతున్నాయి. 

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్య, కానీ అందరికి ఒకే ఉపాయం. ప్రపంచం మొత్తాన్ని భయపెట్టేది వీళ్ల కి సహాయం చేసింది. అదే కరోనా. 

ఎక్కువ మంది ఒక చోట చేర కూడదు అని ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. పెళ్ళి కి 20 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. సాంబయ్య తన దగ్గర ఉన్న డబ్బు తోనే కూతురు పెళ్ళి చేసేసాడు. మగ పెళ్ళి వాళ్లకి ముహూర్తపు పట్టింపు ఉండడం తో పెళ్ళి అప్పుడే చేసేయాల్సి వచ్చింది. 

ఇలాంటి సమయం లో పరీక్షలు నిర్వహించ కూడదు అని చెప్పి, పదవ తరగతి పరీక్షలు రాయకుండానే అందరిని పాస్ చేసింది ప్రభుత్వం. రవి గట్టు ఎక్కేసాడు. 

బయట కి వెల్లే ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పనిసరి అవ్వడం తో అందరు క్లాత్ మాస్క్ లు వాడడం మొదలు పెట్టారు, అవి ఆయితే ఉతికి వేసుకో వచ్చు అని. దీనితో అక్బర్ కి చేతి నిండా పని, రోజు కి 100-200 మాస్క్ లు చేసినా సమయం సరిపోవటం లేదు. అప్పులు తీర్చుకోగలిగాడు. 

కరోనా తగ్గే వరకు అందరికి ఇంటి నుంచి పని చేయాలని సాఫ్ట్వేర్ కంపెనీ లు ప్రకటించాయి. ప్రకాశ్ 4 నెలలు గా ఇంటి నుంచి పగలు పని చేస్తూ తర్వాత కూతురు తో ఆడుకుంటున్నాడు. 

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా అనే సుడిగుండము లో వీళ్ల సుడి తిరిగింది, వీళ్ల చిన్న పాటి కష్టాల నుంచి బయట పడేసినది. 

No comments:

Post a Comment