Followers

Saturday 13 April 2019

హ్యాపీ న్యూ ఇయర్


హ్యాపీ  న్యూ ఇయర్ 

ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ పార్టీ చేస్కోడానికి అడిగిన 5000 రూపాయలు ఇవ్వలేదని శ్రీను అలిగి మధ్యాహ్నం నుంచి భోజనం చెయ్యలేదు. తన జీతం తో మధ్య తరగతి కుటుంబ ఖర్చులని పిల్లల చదువులని అతి కష్టం మీద లాక్కొస్తున్న రామారావు అటు కొడుక్కి నచ్చ చెప్పలేక, ఇటు డబ్బులు ఇవ్వలేక సతమతమవుతున్నాడు. ఏమని నచ్చచెప్పగలడు, ప్రతి పండగకి శ్రీను ఎదో ఒకటి అడగడం, ఎదో ఒక కారణం తో సర్దిచెప్పడం ఆనవాయితీ అయిపోయింది. 15 ఏళ్ళ టీనేజి కుర్రాడిని శ్రీను ని తప్పు పట్టడానికి లేదు. ఆ వయసు అలాంటిది. తన ఫ్రెండ్స్ లా తాను ఉండాలని, వాళ్ళు చేసే ప్రతి పని లో తాను భాగస్వామి కావాలి అనుకోవడం సహజం. కొడుకుది కోరిక, తండ్రిది నిస్సహాయత. ఈ మధ్య తరగతి యుద్ధం, ప్రతి ఇంట్లోను ఉండేదే . ప్రతినాయక పాత్ర లో తండ్రి, కథానాయక పాత్ర లో ఒక ఇంట్లో కొడుకు, ఇంకోచోట భార్య, ఇంకోచోట కూతురు, లేదా తల్లితండ్రులు, ఇలా మారుతూ ఉంటారు. 

రాత్రి 8 అవుతుంది, శ్రీను గది లోంచి బయటకి రాలేదు, భోజనం చెయ్యలేదు. విడతలు విడతలు గా రామారావు, అతని భార్య, శ్రీను అక్క ఎంత బతిమాలినా శ్రీను అలక తీరలేదు. ఇంతక ముందు కూడా ఇలా అలిగిన, కొంత సేపటికి అలక తీరి మాట వినేవాడు, కానీ ఈసారి పట్టుదల గా ఉన్నాడు. ఇంక చేసేది లేక, రేపు ఆఫీస్ నుంచి డబ్బులు తెచ్చి ఇస్తాను అని రామారావు మాట ఇస్తాడు. వెంటనే ఎగిరి గెంటేసిన శ్రీను నాన్న ని గట్టిగ ఒడిసి పట్టుకుని, భోజనం పెట్టమని అమ్మ కి చెప్పాడు. కొడుకు పంతం, ఆనందం చూసి నవ్వుకున్నాడు రామారావు. 

మరునాడు ఆఫీస్ లో 5000 అడ్వాన్స్ కావాలని అర్జీ పెట్టుకుని, ఆ సొమ్ముని నెలనెలా తన జీతం లో కొంచెం కొంచెం గా కత్తిరించామని చెప్తాడు. దానికి సరే అని రామారావు బాస్ 5000 ఇప్పిస్తాడు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో స్కూల్ బయట ఉన్న ఫోన్ బూత్ నుంచి నాన్న కి ఫోన్ చేస్తాడు శ్రీను, ఏమైందో తెలుసుకుందామని. రామారావు ఫోన్ పట్టుకుని ఆఫీస్ నుంచి బయటకి వచ్చి మాట్లాడుతాడు. రామారావు ఫోన్ లో స్పీకర్ లో పెడితే కానీ ఎదుటివాడి మాట వినపడదు. చానళ్ల క్రితం కింద పడిపోయి పాడైపోయింది. డబ్బులు దొరికాయని, సాయంత్రం ఇస్తానని చెప్పడం తో శ్రీను కి టెన్షన్ తగ్గింది. సాయంత్రం రామారావు  ఇంటికొచ్చేసరికే గుమ్మం దగ్గరే కాసుకొని కూర్చున్నాడు శ్రీను. తన ఆత్రం అర్ధం చేసుకున్న రామారావు, కొడుక్కి డబ్బులిచ్చి జాగ్రత్త చెప్తాడు. మన స్థోమత అర్ధం చేసుకుని, దాని బట్టి ఖర్చులు పెట్టాలి అని శ్రీను కి హిత బోధ చేద్దాం అనుకున్నా, సమయం వచినప్పుడు తనే అర్ధం చేసుకుంటాడని ఊరుకుంటాడు. ఆరోజు డిసెంబర్ 31. రాత్రికి ఫ్రెండ్స్ తో పార్టీ అని రాత్రి 8 ఇంటికి తయారయి వెళ్తాడు శ్రీను. 

సరిగ్గా 11:55 ఇంటికి తిరిగి వచ్చేస్తాడు శ్రీను. అందరు పార్టీ చేసుకునే టైం కి తిరిగి ఇంటికి ఒచ్చేసాడని ఆశ్చర్యం కలిగింది రామారావు కి. ఏమైనా గొడవ అయ్యిందేమో అని శ్రీను ని అడుగుతాడు. అలాంటిది ఏమి లేదు, సరిగ్గా 12 ఇంటికి ఇంటిలో అందరి తో ఉండమని వచ్చా అని చెప్తాడు. ఇంతలో సరిగ్గా 12 అవుతుంది. తన జేబు లోంచి కొత్త మొబైల్ ఫోన్ తీసే రామారావు చేతికిచ్చి "హ్యాపీ న్యూ ఇయర్ నాన్న" అని చెప్తాడు శ్రీను. రామారావు కి ఒక్క క్షణం ఏమి అర్ధం కాలేదు. రామారావు ని ఫోన్ కొనుక్కోమంటే కొనుక్కోడు , ప్రస్తుతం నడుస్తుంది కదా, ఎందుకు వృధా ఖర్చు అని. ఆ సంగతి తెలిసే, శ్రీను పార్టీ అని నాటకం ఆడి డబ్బులు తీసుకుని నాన్నకి ఫోన్ కొన్నాడు. కొడుకు మెల్లగా బాధ్యత తెలుసుకుంటే బాగుండు అనుకున్న రామారావు కి, ఎదిగిన కొడుకు ఆలోచన చూసి ముచ్చటేసింది. 


No comments:

Post a Comment