80 లో, 90 లో ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం లో పిల్లలు, రోజూ స్కూల్ కు వెళ్లి సాయంతరం ఇంటికి వచ్చి, ఏదైనా చిరు తిండి తిని, వీది లో స్నేహితుల తో ఆడుకోవడం, తరువాత హోమ్ వర్క్ చేసుకుని, భోజనం చేసి, అమ్మ తో కథలు చెప్పించుకుని పొడుకోవడము. ఈ దినచర్య శుక్రవారం కొంచెం మారుతుంది. హోమ్ వర్క్ త్వరత్వరగా పూర్తి చేసి, 7:30 ఎప్పుడు అవుతుందా అని ఆశ గా ఎదురు చూసే వాళ్ళు. ఆ సమాయనికి దూరదర్శన్ లో చిత్రాలహరి వస్తుoది. 6 పాటలు, అరగంట కార్యక్రమం, దీని కోసమే వారం రోజులు ఎదురు చూపులు. ఆలాగే ఆదివారం మధ్యానం 3:30 కి ఒక సినిమా. ఇదే అప్పట్లో ఎంటర్టైన్మంట్. 5 రూ కి అరగంట అద్దె సైకిల్ దొరికేది. ఆ సైకిల్ తొక్కుతూ హీరో లా ఫీల్ అయ్యి, దగ్గర లో ఉన్న స్నేహితుడి ఇంటికి వెల్లితె ఆ ఆనందమే వేరు. 1 రూ కి 4 చిన్న పాల కోవాలు లేదా పప్పు ఉండలు వచ్చేవి . అవే అప్పట్లో జంక్ ఫుడ్. స్కూల్ బయట అమ్మే పాల ఐస్, ఉసిరికాయలు అంటే పిచ్చి. కొత్త సినిమా పాటల పుస్తకం కొనుక్కుని ఆ పాటలు కంఠస్థం పడితే అదో ఆనందము. వినాయక చవితి వస్తే పిల్లల ఆనందానికి అంతు ఉండదు. వీది లో విగ్రహము పెట్టి, రోజంతా కొత్త సినిమా పాటలు, రాత్రికి తెర కట్టి సినిమా లు వేసేవారు. అప్పట్లో అదే కార్నివల్. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు సినిమా కి తీస్కుని వెల్లితె, ఇంటర్వెల్ లో ఇప్పించె గోల్డ్ స్పాట్ గురించే ఎదురు చూసే వాళ్ళు. సంక్రాంతి వస్తే అమ్మమ్మ నానమ్మ ల ఇల్లకూ వెళ్లి, పిల్లలు అందరూ కలిసి అష్తా చెమ్మ, దొంగ పోలీసు, రాముడు సీతా అడుకుంటే సమయమే తెలిసేది కాదు.
ఆలా మొదలైన ప్రయాణం, ఇప్పుడు 2020 లో చాలా మారింది. వారానికి ఆరు పాటలు, ఒక్క సినిమా వచ్చే రోజుల నుంచి, ఇప్పుడు రోజు మొత్త్తం కేవలం సిన్మాలు, పాటలు మాత్రమే వచ్చే చానెల్స్ బోలెడు ఉన్నాయి. కానీ చూడం. బోర్ కొడుతోంది. ఇది చాలదు అన్నట్టు ఏ సినిమా అయినా, ఏ పాటైనా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోడానికి యూట్యూబ్ ఉంది. త్వరత్వరగా హోమ్ వర్క్ పూర్తి చేసి టీవీ ముందు కూర్చోవాల్సిన పని లేదు. వినాయక చవితి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అద్దెకి సైకిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే సైకిల్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తొక్కొచ్చు. సినిమా కి వెళ్తే కానీ ఇంటర్వెల్ లో కూల్డ్రింక్ తగలేము అనే పరిస్థితి లేదు. ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఒక కూల్డ్రింక్ బాటిల్ ఉండనే ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, మేగీ ఏది కావాలంటే అది ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. కేక్, ఐస్ క్రీమ్, పిజ్జా, ఏది కావాలంటే అది ఇంట్లో కూర్చుని ఆర్డర్ ఇస్తే అరగంట లో ఇంటికి వస్తుంది. అది కాకుంటే, ఇంట్లోనే సొంతంగా చేసుకోవచ్చు. పండగకి ఇంటికి వెళ్తే తప్ప చుట్టాలని చూడలేని పరిస్థితి లేదు. ఎంత దూరం ఉన్న వాళ్లయినా ఒక్క వీడియో కాల్ అంట సేపు పట్టదు చూడటానికి. ఇవి సరిపోవన్నట్టు ప్రపంచ దేశాల్లోని వేరు వేరు భాషల్లోని సినిమాలు, సిరీస్ లు, మనకు అర్ధం అయ్యేలా ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్, హాట్స్టార్ లో దొరుకుతున్నాయి. సినిమా వాళ్ళు, నాయకులు, ఆటగాళ్లు వాళ్ళ గురించి తెలుసుకోడానికి ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వందల్లో స్నేహితుల తో మాట్లాడుకోడానికి, ఫోటోలు వీడియోలు చూసుకోడానికి ఫేస్బుక్. నటించడానికి, డాన్సులు చేయడానికి టిక్ టాక్ లు.
ఒకప్పుడు అద్భుతం అదృష్టం అనుకున్నవి, ఇప్పుడు అవలీలగా దొరికేస్తున్నాయి. అందుకే వాటి విశిష్టత కోల్పోయాయేమో. తేలికగా దొరికే దేనికి విలువ ఉండదు. ఏదయినా ఎక్కువ మోతాదు లో ఉంటె వెగటు పుడుతుంది. ఎంత తక్కువ ఉంటే అంత ప్రత్యేకత.